Total Pageviews

Wednesday, November 24, 2010

నేను పుట్టిన కొన్ని నెలల తర్వాత మానాన్నగారికి రైల్వే లొ గార్డ్ గా ప్రమోషన్   రావడంతో
మా కుటుంబం అంటే అమ్మ,నాన్న..... నన్ను, అన్నయ్యని తీసుకుని విజయవాడ నుండి 1964 లొ  నాన్నగారి ఉద్యోగరీత్యా రాజమండ్రికి మారారట...రైల్వే స్టేషన్ కి దగ్గరలో రెండు వీధుల తర్వాత ఇల్లు. అందులో ఏం ప్రత్యేకత వుంది అని అనుకుంటున్నారా? చాలా చాలా స్పెషల్ .. రాజమండ్రి అంటేనే స్పెషల్ కద... రకరకాల పూలు,సీతాఫలాలు, బత్తాయిలూ, జామపండ్లు....(పూల అబ్బాయి సైకిలు మీద ఇంటింటికీ వచ్చిరెండు చేతులనిండా పూలు ఇచ్చి వెళ్ళేవాడు..ఇప్పటికీ ఆ పద్దతి వుంది అక్కడ).. అన్నింటినీ మించి మా "గోదావరి"....ఆ మా "గోదావరి" గట్టు ప్రక్కనే ఆనుకుని మా యిల్లు(మేము అద్దెకున్నదే)....నేను బాగా చిన్నదాన్ని అప్పటికి.  మా ఇంటి ముందున్న డ్రైనేజి దాటబోయి నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు ఎన్నో అని అమ్మ చెప్తూ వుంటారు..అమ్మ మళ్ళీ మళ్ళీ స్నానం చేయిస్తూ వుండేవారట...గోదావరి ఒడ్డున ఉండడమే ప్రత్యేకత. ..తెల్లవారు ఝామున నిద్ర లేపి మరీ తీసుకు వెళ్తూ వుండేవారు..ఆ నీళ్ళలో జలకాలాటలు, మాకు నచ్చినంతసేపు,,కార్తీక మాసంలో ఐతే అరటి దొప్పల్లో వత్తులు వేసి వెలిగించే దీపాల అలంకరణలు, నీళ్ళలో దీపాలను వదిలినప్పుడు అదో అనుభూతి...ఎవరి దైనా అరటి దొప్ప కొంచెం ప్రక్కకి ఒరిగితే అదిగో నీ దీపం మునిగిపోతుంది అని ఆనందం...మనది కాదు కద అని.. అఫ్ కోర్స్..నేను మౌనంగా ఇవన్నీ వింటూ వుండేదాన్ని.. ఎందుకంటే ...నా బాల్యమంటేనే ఒక "మౌనం".................నా బాల్యం ఒక తెల్లని ఖాళీ పేజీ....అందులో ఒక చిరునవ్వు మాత్రమే కన్పించేది. అందుకే ఆ పేజీ నాకు చాలా చాలా ఇష్టమైనది..మరల మరల వెనకకి తీసుకురాలేనిది...మా భారతి గారితో చెప్తూ వుంటాను........."భవిష్యత్ లో మీరు ఏదైన పుస్తకం వ్రాస్తే అందులో నాకు సంబందించిన విషయాలకు వస్తే కొన్ని బ్లాంక్ పేజీలు వుంటాయి" అని....తర్వాత ఇల్లు సరిపోవడం లేదనో, లేక ఏదో కారణం వల్ల కావచ్చు, రెండు వీధులు ఇవతలకి ఇల్లు మారారట..అదీ గోదావరి గట్టుకి నాలుగు అడుగుల దూరంలోనే...రైల్వేస్టేషన్కి మరీ దగ్గరలో..ఏవో నాలుగైదు సంఘటనలు తప్ప నాకు మరీ గుర్తుండే అంశాలు లేవు...ఒకసారి మా అత్తయ్య గారి అమ్మాయి మా ఇంటికి వచ్చింది.  బహుశా హాలిడేస్ ఐ వుండవచ్చు.నాన్నగారు డ్యూటీ మీద విశాఖపట్నం వచ్చేవారు..మా వదినకి విశాఖపట్నం చూపించుతానని తనని స్టేషన్ కి తీసుకు వెళ్ళారట.. మా మేనమామ (మా దగ్గరే వుండేవారు) గబ గబ వచ్చి నన్ను తయారు చెయ్యమని మా అమ్మ గారితో చెప్పి  తర్వాత సైకిలు మీద  హడావిడిగా రైల్వే స్టేషన్ కి తీసుకు వెళ్ళి మా వదిన ప్రక్కన కూర్చో బెట్టడం గుర్తుంది... సీను మార్చితే విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ దగ్గర వున్న రామక్రిష్ణా బీచ్ దగ్గరకు తీసుకు వెళ్ళిన తర్వాత మా నాన్నగారు సముద్రం, ఆకాశం కలిసినట్లుండే ప్లేస్ చూపించి "అదేమీటో చెప్పండిరా"  అని అడిగిన గుర్తు... ఏదొ షాప్ కి తీసుకు వెళ్ళి మా వదినకి క్రీమ్, ఫేస్ పౌడర్ లు కొని ఇచ్చిన గుర్తు.. నాకు ఒక సరదా ఉండేదండి...మా ఇంట్లో ఒక సైకిల్ ఉండేది... ఆ సైకిల్ ఫెడల్ పట్టుకుని, చక్రం త్రిప్పుతూ ఉండడం. పనా.పాటా.. అప్పటికి స్కూల్ లో కూడా జాయిన్ చెయ్యలేదు కద.. ఒకసారి మా ఇంటి కి ఎదురుగానే ఉంటున్న మా ఇంకో మామయ్యగారి ఇంట్లో ఆడుకుంటున్నపుడు "భూకంపం వచ్చింది. అందరూ బయటకి రండి" అని అందరూ కేకలు పెడుతూ బయటకు పరుగులు పెట్టడం గుర్తుంది...వాళ్ళింట్లో రెండు తెల్లని, అందమైన కుందేళ్ళు ఉండేవి..వాటితో ఆడుకునే వాళ్ళం.. నా సరదా చెప్పాను కద...ఒకరోజు సాయంత్రం సైకిలు చక్రం తిప్పుతూ కూర్చుంటే సైకిల్ జారి నా మీద పడడం, దాని హాండీల్ బార్ నా నుదుటిని త్రాకడం, హాస్ఫిటల్ కి తీసుకు వెళ్తే పదకొండు కుట్లు పడడం గుర్తుంది.. లేకుండా ఎక్కడికి పోతుంది ? నా నుదుటి ఎడమ ప్రక్కన అలంకారంగా మిగిలిపోయింది..... ఆ ఇల్లూ సరిపోవడం లేదని(మా ఇంటికి వచ్చిపోయే బంధువుల సంఖ్య పెరగడంతో) ఈ ఇంటికి కొద్ది దూరంలోనే వున్న మరో ఇంటికి మారి, క్రింద ఒక పోర్షను, మేడమీద ఒక పోర్షను అద్దెకి తీసుకున్నారు... మా తాతగారు నన్ను స్కూల్ లో జాయిన్ చేసింది ఈ ఇంటికి మారిన తర్వాతనే...

No comments:

Post a Comment