Total Pageviews

Saturday, June 11, 2011

గోదావరి గట్టు గురించి ఎంత చెప్పినా తరగదు. సాయంత్రం ఈ చివరినుండి ఆ చివరకి నడకలు, పిల్లలు ఆడుకోవాలన్నా, రోడ్దుమీదకు వెళ్ళి, బస్సు లేదా రిక్షా ఎక్కి మెయిన్ బజారుకి వెళ్ళడానికి బద్దకించేవారు, గోదావరి గట్టు మీద సరదా, సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళి రైల్వే గేటు ప్రాంతంలో క్రిందకి దిగి, మెయిన్
రోడ్డు ఎక్కేవారు.. సైకిళ్ళు వేసుకుని పందాలతో నడిపేవారు.. ఏం చేయడానికి పాలుపోని నాలాంటివారు సైలెంటుగా కొద్ది దూరంలో ఉన్నగోదావరిని చూస్తూ వుండిపోయేవారు.

అన్నిటికన్నా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే........... మా ఇంటికి ఎదురుగా కాక ఆ ప్రక్క ఇంట్లో ఒక కుటుంబం ఉండేది..పేర్లు వ్రాయను. కాని ఆ వీధికంతటికీ సందడిని తెచ్చే సంఘటనలతో సరదా సీన్లు కన్పిస్తుండేవి... నిజానికి ఆ ఇంటి యజమాని ఒకప్పుడు రిక్షా పుల్లర్ అట, ఎక్కడో చిన్న పూరింట్లో ఉండేవారట, మొదటి భార్య చనిపోతే ఆమె ద్వారా కలిగిన ఒక ఆడపిల్లను చూసుకోవడానికి రెండవ పెళ్ళి చేసారట.

ఆమె వచ్చిన వేళా విశేషం, రిక్షా నడపడం మానేసి ఒక సేఠ్ దగ్గర పనికి జాయిన ఐన కొన్నాళ్ళకు ఆ సేఠ్ దగ్గర వెయ్యి రూపాయిలు అప్పు తీసుకుని ఇతను వడ్డీకి అప్పులు ఇవ్వడం మొదలు పెట్టారట..
ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా డబ్బు కూడగట్టుకుని ఆ ఇల్లు కొనుక్కుని వచ్చారట..ఐతే ఎమిటి అంటారా...ఒక విధంగా చెప్పాలంటే ఆర్ధికంగా స్థిరపడ్డారు..విచిత్రం ఏమిటంటే, అతను తన బిజినెస్ టైము ఐపోయి ఇంటికి తిరిగి వస్తూ తన భార్య కోసం ఏవో ఒకటి తీసుకువచ్చేవారు..ఆ వీధి చివరినుండే అందరికీ వినిపించేలా "ఏమెవ్ సరస్వతీ, నీకు మల్లెపూలు తెచ్చానే" అనో లేదా "నీకు స్వీట్స్ తెచ్చాను" అనో అరచుకుంటూ వస్తుంటే ఇళ్ళల్లో వున్నవారు అందరూ పిల్లలతో సహా బయటకు వచ్చి ఒక వింత జంతువును చూసినట్లో లేక జోకర్ని చూసినట్లో ఒక విధంగా చెప్పాలంటే అవి ముసిముసి నవ్వుల సరదా గడియలు...మర్చిపోలేని క్షణాలు..
అతని ప్రతి మాటా, నడకా అందరికీ వినోదదాయకం..పెద్ద కూతురుని ఒక మాదిరిగా చూసేవారు(మొదటి భార్య కూతురు). ఈమెకు పుట్టిన పిల్లలను పేరు పేరునా పిలిచి ఏదో ఒకటి ఇచ్చేవారు..రెండవ అమ్మాయి కొంచెం రంగు తక్కువ. ఆ పాపను, నా నల్ల బంగారమే... అంటూ ముద్దుల వాన కురిపించేవారు ఇంటి బయటే..
నా పెళ్ళి ఐన తర్వాత నేను,మావారు కలసి ఆ వీధిలో తెలిసిన వారి ఇంటికి వెళ్ళి వస్తుంటే మా ముందు నుండి ఒక లూనా వెళ్ళింది. దాని పైన ఉన్న వ్యక్తిని చూపించి.. ఎవరో చూడండి, ఎలుక పైన ఏనుగు కూర్చున్నట్లుంది.. అన్నాను. మావారు "ఇంకేవరు, మీ మావయ్యగారు" అన్నారు. విషయం ఏమిటంటే, తను కొత్తగా బోలెడు డబ్బులు పోసి ఒక లూనా కొనుక్కున్నానన్న విషయం చుట్టుప్రక్కల అందరికీ తెలియాలని తన రెండవ కూతుర్ని, అదే తన నల్ల బంగారాన్ని ముందు కూర్చోబెట్టుకుని అన్ని వీధులూ త్రిప్పుతున్నారని...
వాళ్ళ పెద్దబాయి నా క్లాస్ మేట్.. అసలు చదివేవాడు కాదు.. నాతో పోల్చి తనకి రోజూ అక్షతలు భయంకరంగా వేస్తూ వుండేవారు.. మెరిట్ లో వుండడం నా తప్పా అనిపించేది నాకు.
ఊహ తెలిసిన తర్వాత ఆ ఇంటి ఆవిడ (అత్తయ్యగారు అని పిలిచేవాళ్ళము) సన్నజాజులు కోసి సగం నన్ను తీసుకోమని,తను సగం తీసుకునేవారు..అప్పుట్నుంచి మాల కట్టడం నేర్చుకున్నాను..
దండ కట్టి అమ్మకి ఇస్తే, నాకు కావాలి అని నా తర్వాత పుట్టిన నా చెల్లెలు రెండు జడలు వేయించుకుని పూలు తలలో పెట్టించుకుని, అందరికీ చూపడానికి వెళ్ళిపోయేది....
మా ఇద్దరి జడలూ పొడవు కావడంతో అమ్మ ఓపికగా (నాన్నగారు తాటాకుబుట్టలతో చేమంతి,లిల్లీ, మల్లెపూలు గులాబీలు తెచ్చేవారు) జడలు పూలతో కుట్టి, మమ్మల్ని తయారుచేసేది. బయటకు వెళ్ళి (మరి అందరికీ చూపించాలి కద) కొంచెం అటు వెళ్ళేవాళ్ళమో లేదో, మేకలు మా తలలోని పూలు తినడానికి లాగేసేవి.... నా అంత పెద్ద జడలనీ నాగేంద్రునికి మొక్క ఉంది అని అమ్మ గుడివాడ దగ్గర మోపిదేవి అనే ఊరికి తీసుకు వెళ్ళి మరీ కట్ చేయించింది., ).అప్పుడు నేను ఏడవ తరగతిలో వున్నాను.)... ఎంతలో ఎదుగుతాయిలే అని ఒక ఓదార్పు. ఐతే ఏ ఫీలింగ్స్ లేని నాకు అది
ఏమీ తెలియని మార్పు కావడంతో బాధ పడింది ఏమీ లేదు...చాలా త్వరగానే నా జుట్టు పెరిగి జడలు వేసుకునేదాన్ని.

నాన్నగారిది ఒక సమయం అని ఫిక్స్ డ్ లేకపోవడం వల్ల తనకి ఉదయం ట్రైన్ కి వెళ్ళాలి అన్నరోజున అమ్మ రాత్రిళ్ళు మా ఇద్దరికి జడలు అల్లి పైకి రిబ్బన్ తో కట్టేసేది. మరల మరుసటిరోజు సాయంత్రం వరకు జాగ్రత్తగా వుంచుకోవల్సిన భాద్యత మాది. ఆ రోజుల్లో ప్రతిరోజూ తలకి కొబ్బరినూనె వ్రాయనిదే జడలు వేసేవారు కాదు..ఆ సమయంలో పిల్లలు ఎలా ఉండాలి, ఏం చెయాలి లాంటి హితభోధలు ఉండేవి.. అది ఒక కేరింగ్ మరియు తర్వాత తరాల వారికి మార్గధర్శకం..ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో ఈ సంస్కృతి కన్పిసుంది. మరి ఈనాటి జీవనవిధానంలో ఆ పెద్ద కుటుంబాలు లేవు, ఈ మన తల్లిదండ్రులకి మనతో గడిపే ఆలోచన, సమయం లేవు..వున్న సమయాన్ని పిల్లల కోసమే కదా మేము ఇంత కష్టపడుతుంది అని తమను తాము సమర్ధించుకుంటున్నారు... కాని తప్పదు..
చదువుకున్న చదువులు, నా జీవితం, నా భవిష్యత్తు అన్న భావనలు....పెరిగిన ఖర్చులు, పిల్లల ఫీజులు, సరదాలు, ఇవన్నీ తట్టుకోవాలంటే సమయంతో పాటుగా కొట్టుకుపోవడం తప్ప మరేమి చెయ్యలేని పరిస్థితులు.
కాని ఒక్క విషయం................ ఒంట్లో ఓపిక తగ్గి, అంతగా పరుగులు పెట్టలేని స్థితిలో ఒక్కసారి కళ్ళుమూసుకుని తమ తమ గత జీవితంలోనికి తొంగి చూస్తే................. కనిపించేది అంతా "శూన్యమే". మనకే ఆశ్చర్యం కలుగుతుంది....... "ఇదా మన గతం" అని................. అందుకే కాబోలు పెద్దలు అన్నారు "ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,,ముళ్ళున్నా,రాళ్ళున్నా సాగాలి మన పయనం " అని.
, rukmini devi

2 comments:

  1. అవునండి ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం..
    ఒకప్పుడు నాగళ్ళు పట్టేవారు...నేడు ట్రాక్టర్ ల తో సేద్యం చేస్తున్నారు..
    ఒకప్పుడు పోస్ట్ మాన్ వస్తే వీధంతా పండగే..నేడు ఈ మెయిల్స్ ఆ ముచ్చటను
    దూరం చేస్తున్నాయి..
    ఒకప్పుడు పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు ..నేడు పల్లెలో వుండే వాళ్ళంతా పట్టణాలకు ఎగబడుతున్నారు..
    అంత గ్లోబలైజేషన్ మహిమ...ఎం చేస్తాం..
    మంచి టపా రాసారండి

    ReplyDelete
  2. kadhaasagar gaaru, manninchaali.. mee comment eeroje choosaanu.. gata koddirojulugaa nenu panula vattidilo blog lo emi vraayadam ledu...thank you very much andi..

    ReplyDelete